ఏపీ రాజధాని అమరావతికి కులంరంగు పూసి, రాజకీయాలు అంటగట్టి వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మూడు రాజధానులతోనే రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని నాలుగేళ్లుగా వాదిస్తూ కొండలు పిండి చేసేస్తోంది. బాధ్యాతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ధర్మాన ప్రసాదరావు విశాఖ రాజధాని అయితేనే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుందని లేకుంటే కాదని వితండవాదన చేస్తున్నారు. అంతేకాదు… విశాఖ రాజధాని చేయకపోతే విశాఖను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి జరుగుతుందనే విచిత్రమైన సిద్దాంతం సృష్టించడమే కాకుండా సంక్షేమ పధకాలనే అభివృద్ధి అని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు కూడా.
పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దేనికైనా శంకుస్థాపన చేసిందంటే అది యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి కావలసిందే! ఈ నాలుగేళ్ళలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే తెలంగాణ ప్రజలు గర్వపడేలా కొత్త సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ ఇంకా అనేకం నిర్మించింది… దుర్గం చెరువు కేబిల్ బ్రిడ్జ్, మరో డజను భారీ ఫ్లైఓవర్లు నిర్మించింది. ఇంకా నిర్మిస్తూనే ఉంది.
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డా.అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ ఇటీవలే జరిగింది. రూ. 650 కోట్లు వ్యయంతో హైదరాబాద్ నాలుగు దిక్కులలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రులను నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో నదులు లేవు… సముద్రమూ లేదు. కానీ రాజేంద్రనగర్‌లో నిర్మిస్తున్న ఏకో పార్కులో దేశంలోకెల్లా అతిపెద్ద ఎక్వేరియం ఏర్పాటు చేస్తోంది.
హైదరాబాద్ నగరానికే అభివృద్ధిని పరిమితం చేయకుండా అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధి చేసుకుపోతోంది. ప్రతీ జిల్లాలో వైద్యకళాశాలలు, సమీకృత కలెక్టర్ కార్యాలయాలు, సమీకృత మార్కెట్ భవనాలు, పోలీస్ కమీషనరేట్ భవనాలు, ఆసుపత్రులు, వాటిలో ఉచిత వైద్య పరీక్షలు, కాలేజీలు, ఐటి పార్కులు, పారిశ్రామికవాడలు, అందమైన పార్కులు, ట్యాంక్‌బండ్‌లు, వంతెనలు చకాచకా నిర్మిస్తోంది.
తాజాగా వరంగల్ నగరంలో శరవేగంగా నిర్మాణమవుతున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వాసుపత్రి ఫోటోలను ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ “అభివృద్ధే కాదు… ఆరోగ్య వికేంద్రీకరణ కూడా చేస్తున్నామంటూ” ట్వీట్ చేశారు. నిజమే కదా! రూ.1,200 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2021, జూన్ 21న వరంగల్ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేయగా అప్పుడే 9 అంతస్తుల నిర్మాణం పూర్తయిపోయింది. మరో ఏడాదిలో హాస్పిటల్ నిర్మాణం పూర్తయి కేసీఆర్ ప్రారంభోత్సవం కూడా చేయడం ఖాయమే.
ఏపీలో ఇంతవరకు అభివృద్ధిపనులే మొదలుపెట్టలేదు. మూడు రాజధానులు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని వాదిస్తోంది కనుక అభివృద్ధి లేదు వికేంద్రీకరణ లేదు. మళ్ళీ అధికారంలోకి వస్తామో రామో అనే అనుమానాలు ఉండటంతో ఎన్నికలు దగ్గరపడుతుంటే ఇప్పుడు తాపీగా శంకుస్థాపనలు చేస్తున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, ఫిషింగ్ హార్బర్, వంశధార ఎత్తిపోతలకు శంకుస్థాపన చేయగా, మే 3న భోగాపురం విమానాశ్రయానికి మళ్ళీ మరోసారి సిఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ సిఎం కేసీఆర్, మంత్రులు ఈ నాలుగేళ్లలో పూర్తిచేసిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తుంటే, మన మంత్రులు ఇంకా శంకుస్థాపన దశలోనే ఉన్నారంటే సమర్దత, దూరదృష్టి, పరిపాలనలో ఇద్దరు ముఖ్యమంత్రులకి ఎంత తేడా ఉందో అర్దమవుతోంది కదా?